Monday, 30 August 2021

తెలుగు భాషా దినోత్సవం

మా తెలుగు తల్లికి మల్లెపూ దండ 

అంటూ చిన్నప్పుడు తెలుగు తల్లిని పొగుడ్తూ రాసిన పాటను వింటూ లేచేవాడిని . ఈ సారి ఏమి లేదాయ్  .. .. .. 

నిన్న తెలుగు భాషా దినోత్సవం. ప్రతీ ఏటా శ్రీ గిడుగు రామమూర్తి గారి జన్మదినం పురస్కరించుకుని మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము.

ఐతే ఈ సరి ఎందుకో మరిచి పోయాను. మా మావయ్య గుర్తు చెయ్యడం తో నాకు తట్టింది. ఇలా మర్చిపోవడం ఏమిటీ అని నా మీద నాకు చికాకు వేసింది . 

ఎం చేస్తాం .. ఈ కాలం మహిమ; అన్ని ఈ కాలమ్స్ రాసి , చదివి అసలుకే ఎసరు పెట్టినట్టైంది. ఇంకా ఇంట్లో ఈనాడు పేపర్ రావడం తో నాలో ఇంకా తెలుగు బతికే ఉంది. కనీసం నా వంతు రెండు పదాలు అన్నట్టు ; ఈనాడు ఆదివారం పుస్తకం లో పద వినోదం చేయడం ప్రారంభించాము - నేను, మా ఆవిడ, అబ్బాయి. 

అవి అర్ధం చేసుకుని తగిన పదాలు రాయడానికి చాలా కష్ట పడ్డాను. నా తెలుగు ఏడ్చినట్టుంది. ముక్కుతూ మూలుగుతూ , ముగ్గురం కలిసి పూర్తి చేసాము. కొంచెం కష్ట పడ్డా, చాలా ఇష్టం గా చేసాము - ఇది నాకు బాగా నచ్చింది. పైగా ముగ్గురం కలిసి ఒక పని చెయ్యడం అన్నది అరుదైపోయింది ఈ మధ్య. 

తెలుగు నన్ను నన్నుగా చేస్తుంది, నాలో ఆలోచన తట్టి లేపుతుంది. మాటల్లో చెప్పలేనంత ధైర్యాన్ని ఇస్తుంది . అందుకే  దాన్ని మాతృ భాష అంటారేమో . భాష ద్వారా భావం వ్యక్తమైతే ; ఆ భావం భావి తరాలకి మనం ఇచ్చే అమూల్యమైన ఖజానా. 

ఇక నుంచి కనీసం ప్రతీ రోజు తెలుగులో రాయాలని నిశ్చయించుకున్నా ..... 



 

తీర్థ యాత్ర

తీర్థ యాత్ర
టైం:  9 
స్థలం: భూమికి ఆకాశానికి 
మధ్యలో 
తేదీ : మార్చి 6, 2020 సంవత్సరం  


నిద్రావస్థలో ఉన్నారు చాలా మంది .  రాత్రి అనుకున్నారేమో కాదు పట్ట పగలే . చేతిలో ఇష్టమైన సాక్షి పేపర్ చదువుతూ మా మావగారు హెడ్లైన్ ఒకటి చూపించారు "అల్లుడికి గిల్లుడు". రాబోయే రెండు రోజుల్లో యాదృచ్చికంగా నాకు వర్తిస్తుంది అని నాకు అప్పుడు అర్థం అవ్వలేదు. ఎక్కడికి ఈ యాత్ర అని అనుకుంటున్నారా ... మా మావగారి 70వ జన్మదినం పురస్కరించుకుని మేము విహార యాత్రతో మొదలెట్టి తీర్థ యాత్రకి తేలాము . 

శ్రీకారం 
ఈ ఏడాది 70 వసంతాలు పూర్తి చేసుకుని మా అందరితో సరదాగా కాసేపు ఉందాము అనుకున్నారు మా ఫిల్  (ఫాదర్ ఇన్ లా). మొదట పిల్లలితో కలిసి రామోజీ ఫిలిం సిటీ వెల్దాము అని అనుకున్నారు ... కానీ తాను ఒకటి తలస్తే దైవం ఒకటి తలచింది అని ...... సతీ లీలావతి సినిమా లో రమేష్ బెంగుళూరు ట్రిప్ కోసం ప్లాన్ చేసినట్టు ........ అక్కడినుంచి యాదగిరిగుట్ట అనుకుని  చివరికి కర్ణాటక రాష్ట్రం లో పుణ్య క్షేత్ర దర్శనం ఖాయం చేసాము.
మాములుగా మా బటాలియన్ తో ట్రిప్ అంటే కప్పల తక్కిడి బేరం లాగ అంత సులువుగా కుదరదు .. ఎవరో ఒకరికి ఎదో ఒక అడ్డంకు వస్తూనే  ఉంటుంది . కాని దైవ లీల, మా  వదిన గారి సంకల్పం గట్టిగ ఉండడం తో ఈ యాత్ర శ్రీకారం చుట్టుకుంది. మామూలుగా అంత వీజీ గా విమానం ఎక్కడానికి ఇష్టపడని మా గణం ఠక్కున ఓకే చెప్పడం , వెను వెంటనే ట్రావెల్స్ వారితో మాట్లాడడం, రూమ్ల బుకింగ్, ఆఫీస్ సెలవులు, పిల్లల పరీక్షలు  ...   అన్నీ ఊహించని రీతి లో అతి తక్కువ కాలం లో కుదిరిపోయాయి. 

పెట్టె రెడీ 
డబ్బివ్వని వాడు పడవ ముందు ఎక్కాడట ... నేను అంతే,  చెప్పడమే  తడవు మొదట రెడీ అయిపోయా  .... ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వెల్దాము అని అనుకున్న ఈ క్షేత్రాలన్నిటికి. మంచి తరుణం మించిన దొరకదు ..... 

మొత్తానికి కదిలింది జగన్నాథ రథం అన్నట్టు.. పది మంది తో కలిసి మంగళూరు ఫ్లైట్ ఎక్కాము. మా వారం రోజుల భక్తి దండయాత్ర కి మంగళ ట్రావెల్స్ వారి సౌజన్యం తో 12 సీటర్ టెంపో రథం ఒకటి  బుక్ చేసాము. దానికి ప్రభాకరన్ మా సారథి. 

తెల్లవారుఝామునే బయలు దేరటం తో దిగ్గానే  కడుపులో నక నక. డ్రైవర్ బాబు ఎదో మంచి హోటల్ అంటూ తీసుకెళ్లాడు. అది ఎదో నోరు కొలిచి బూరి వండే బాపతు ... "ఇడ్లి ఓవర్. ఓన్లీ దోస అవైలబుల్"  అన్నాడు వెయిటర్ అదో రకంగా .  చచ్చినాడి  పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఎదో ఒకటి పడెయ్ మా మొహం మీద అనుకుని ఉన్నదాంతో  తృప్తి పొందాము.  ఇక నుంచి సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్టు గుడిలోనే తిందామనుకున్న.  

మొదటి దణ్ణం 
ప్రథమ నమస్కారం ఆత్మా రాముడికి పెట్టాకా,  మేము కుద్రోలి గోకర్ణనాథ్ గుడికి వెళ్ళాము . చాలా బాగా కట్టారు ..చాలా విశాలమ్ గా పెద్ద గుడి కట్టారు. గుడి నిర్మాణం చూస్తే ఇటీవల పెద్ద పెద్ద నాయకులు కట్టించారు అని అర్ధం అయ్యింది.  
అక్కడనుంచి మంగళ దేవి గుడికి వెళ్ళాము. మంగళ దేవి మూలంగానే మంగళూరు అని పేరు వచ్చిందట.  పూర్వం పరశురాముడుకి ఇక్కడ  సముద్ర తీరంలో  శివ లింగ  రూపంలో దొరికింది అని, తరువాతి కాలంలో కుండవర్మ అనే రాజు నవనాదులైన మత్స్యేంద్రనాథుడు మరియు గోరఖ్నాధుడు అనుజ్ఞ మేరకు కట్టించాడు అని ఇక్కడ   స్థల పురాణం . ఏది ఏమైతేయ్ నేఁ మంగళూరు గ్రామ  పెద్ద కి 
నమస్కారం  పెట్టి  బస్సు ఎక్కి కూర్చున్నాము

ఓ షణ్ముఖా!
జాలీ  గా మొదలయ్యింది  ప్రయాణం .   వారానికి సరిపడా నీళ్లు కొనుక్కుని కుక్కే సుబ్రమణ్య  వైపు బయలుదేరాము. చక్కని కొండల మధ్య నుంచి  ఘాట్ రోడ్డు లో నుంచి  వెడుతూ ఉంటే చాలా బావుంది.  దీనికి తోడుగా మంచి సంగీతం కూడా కలిపి మేళాలతో ముందుకు సాగాము.   అల వైకుంఠపురంలో!  సమజవరాగమనా అంటూ రక్తితో మొదలయ్యి  కైలాసగిరివాస శంభో మహాదేవ! అంటూ భక్తి పాటల వైపు వెళ్ళాము.
మధ్యాహ్నం చేరే సమయానికి గుడి మూసేసి ఉంది. సరే వేళకి  పడని  దే  బండి ముందుకు సాగదు  కదా .  సో లంచ్ చేద్దామని బయలుదేరాము. గుడి ఎదురు వీధిలోనే కుమార కృప అని హోటల్ కనిపించింది . సరే భక్తి  ఎక్కువైన వాళ్ళు తాగడానికి టీ , భక్తి తో పాటు వయసు ఎక్కువైనా వారు ఇడ్డెన్లు, తక్కిన వారికి  భోజనాలు ఆర్డర్ ఇచ్చ్చాము .... తెల్ల లుంగీ ఎర్ర చొక్కా తొడుక్కున్న వెయిటర్ భట్ కి  (అఛ్చమైన కన్నడ  వాడు).   టీ చుక్క గొంతులో పోసుకోగానే  మాయమయ్యింది మా  వదిన గారు. ఎక్కడ అని వెతికి చూస్తే పూజ టిక్కెట్టు కొనడానికి బయలు దేరింది. అక్కడ ఆశ్లేష బాలి అని చేస్తారట ఆశ్లేష నక్షత్ర దోషం తొలగి పోవటానికి .
ఇప్పటి నుంచి తక్కిన ప్రయాణం అంత మాకు టాప్ లేచింది . అంటే , మగ వారు చొక్కా ఇప్పి గుడిలోకి ప్రవేశించాలి.. ఇక గుడి తెరిచే సమయానికి లోనికి బయలుదేరాము. పూజ టిక్కెట్టు కొనుక్కుని లైన్ లో వెళ్లి కూర్చున్నాము. ఇక్కడి గుళ్ళల్లో పూజ సంకల్పం బయట చెప్పి దర్శనానికి లోపలికి వెళ్ళమంటారు.  అద్భుతమైన దర్శనం. లైన్ లో జనం ఉన్న లోపలికి వెళ్లిన తర్వాత ఖాళీ , ప్రశాంతత. 30 నిమిషాల పాటు అంతరాయం లేని దర్శనం. మొదట స్వామి వారి రూపు అర్ధం అవ్వలేదు, తరువాత పరికించి చూస్తే, నాలుగు భాగాలుగా ఒక దాని మీద మరొకటి - ఆదిశేష, వాసుకి, నెమలి, షణ్ముఖ - ఆరు తలలతో సుబ్రమణ్య స్వామి.
ఇక అక్కడి నుంచి బలవంతంగా బయటకు వచ్చాము. గుడి లోనుంచి ఆది సుబ్రమణ్య స్వామి వారి గుడి దారి వైపు వెళ్ళాము కానీ మా గ్యాంగ్ అందరు లేరని , చెప్పులు లేవని మళ్ళీ వెనుతిరిగాము. ఇంతలో అందరు హడావిడి గ బస్సు వద్దకు బయలుదేరారు. ఈ తొందర దేనికో నాకు అర్ధం అవ్వలేదు.  తర్వాత చెప్పారు, కుమార ధారా ఆంటె స్మాల్ వాటర్ బాడీ , కి వెళ్లి స్నానం చెయ్యాలని , లేట్ అయితే  కష్టం అని...కానీ నాకు మనసులో ఆది సుబ్రమణ్య వెళ్లాలని ఉంది .. మరి ఎలా?
డ్రైవర్ ని అడిగా అక్కడకు తీసుకెళ్లామని .. అందరు రా లేకపోతే, నేను ఒక్కడిని గభాలున వెళ్లి వస్త్తాను అని...... కాని తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అని ..... డ్రైవర్ గుడి వద్దకి తీసుకెళ్లడం, నేను వెళ్లడం, అటు తర్వాత ఒకరి తర్వాత ఒకరు రావటం అంత... స్వామి వారి లీల.అక్కడ సుబ్రమణ్య స్వామి పుట్ట, చాలా పెద్దది. మొదట రావా టానికి సంకోచించిన మా మావగారు, తెలిసినవారు ఇఛ్చిన డబ్బులు హుండీ లో వేయటం మరచి పోవటం , అది మల్లి గుర్తుకు రావటం, అందుకనే మేము ఆది సుబ్రమణ్య గుడికి వెళ్ళటం జరిగింది... స్వామి వారు మొక్కుబడి కదా మరి .... ఇంతలో మా ఆవిడ ఫోన్ లో సందర్భోచితంగా మెసేజ్ రావటం...... ఒక్క మాట నిజం , స్వామి అక్కడ ఉన్నాడు..
అక్కడి నుండి కుమార ధారా కి వెళ్లి స్నానాల వారు , నీరు జల్లుకునే వారు , యధా శక్తీ కానిచ్చి , ధర్మస్థల కి బయలుదేరాము

ఆట గదరా శివ 
ఓహో గరళ కంఠ .. నీ మాటంటే..... ఇది మంజునాథ చిత్రం లోని పాట, ధర్మస్థల మంజునాథ స్వామి వారి చరిత్ర . ఇక్కడికి చేరుకునేటప్పడికి రాత్రి 7 అయ్యింది .. ముందు గా రూంలో దిగి వెల్దాము అనుకున్నము కాని టైం వేస్ట్ చెయ్యకుండా గుడికి పరిగెత్తాము.   
మళ్ళీ యధావిధిగా మా టాప్ లెస్ అవతారాo ఏత్తాము. ఐతె, ఈ సారి హుఠాహుఠిన లేగత్తాము. ఈ సారి నడక కొంచెం బాగానే ఉంది .  లోనికి ప్రవేశం చేసే ద్వారం నుంచి మొదలు అసలు స్వామి వారి దర్శనం చేసే వరకు బాగానే నడవ వెలిసి వచ్చింది.  సన్నటి జాలీలా గుండా ఆలయ ప్రాంగణం లోనికి వెళ్ళాము. ఆ ముక్కంటిని చూసే యత్నం లో మా బ్యాచ్ 3 ముక్కలయింది.  వృద్ధులు, పిల్లలు, మరి మేము.....
మేము నలుగురం మాటల్లోపడి పిల్లల సంగతి మరిచాము. వాళ్ళు ఎక్కడ కనపడలేదు. పరుగు పరుగున గుడి లోపలి చేరేయ్ సరికి వాళ్ళు ముగ్గురు కనిపించరు . హమ్మయ్య అనుకున్నాము. 
గుడి లోపలికి వెళ్ళటానికి ఎక్కేదారి ,దిగేదారి ......  

సశేషం .... ..... ......